|
చింతపల్లి, మే 8: విశాఖ మన్యంలో బాక్సైట్ సెగ మళ్లీ రాజుకుంటోంది. తవ్వకాలు జరవద్దంటూ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గిరిజనులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రజల పక్షాన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పొరాటం చేయాలని, లేదా తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మావోయిస్టులు హె చ్చరించారు. దీంతో వారంతా గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి నాడు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పెదవలస, జర్రెల, సప్పర్ల గ్రామాల్లో వందలాది మంది గిరిజనులు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. గిరిజనులు సంప్రదాయ ఆయుధాలతో కదంతొక్కారు. ప్రాణాలు అర్పించైనాసరే బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని గిరిజనులు నినదించారు. ఐదేళ్ల క్రితం బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమలింగం, చింతపల్లి జడ్‌పీటీసీ సభ్యుడైన నాటి జిల్లా పరిషత్ ఉపాఽధ్యక్షుడు ఉగ్రంగి సోమలింగాన్ని సీపీఐ మావోయిస్టులు కాల్చి చంపేశారు. ఏజెన్సీలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని అల్టిమేటం జారీచేశారు. దీంతో పలువురు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో రెండేళ్లపాటు ఏజెన్సీలో స్థానిక పాలన స్తంభించింది. ఈ తరుణంలో చింతపల్లి పర్యటనకు వచ్చిన అప్పటి కేంద్ర మంత్రులు జైరాం రమేష్, కిశోర్ చంద్రదేవ్, రాష్ట్ర మంత్రి బాలరాజు... బాక్సెట్ తవ్వకాలు జరగవని, గిరిజనులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పడంతో ఉద్యమం చల్లారింది. నాలుగేళ్ల నుంచి మన్యంలో బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలు దాదాపు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ... బాక్సైట్ తవ్వకాలకు చర్యలు చేపడుతున్నట్టు ప్రచారం జరగడంతో గిరిజనుల్లో మళ్లీ అలజడి మొదలైంది. మరోవైపు మావోయిస్టులు తెరపైకి వచ్చారు.
|
No comments:
Post a Comment